Chicken Leg Fry : మనలో చాలా మంది చికెన్ తో పాటు చికెన్ లెగ్ పీసెస్ ను కూడా ఇష్టంగా తింటారు. కొందరు స్పెషల్ గా లెగ్ పీసెస్ ను కొనుగోలు చేసి మరీ తీసుకుంటారు. కేవలం చికెన్ లెగ్ పీసెస్ తో కూడా వివిధ రకాల డిషెస్ ను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ లెగ్ పీసెస్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో లెగ్ పీస్ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఫ్రైను తిన్న వారు మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు ఇలా ఎవరైనా ఈ లెగ్ పీస్ ఫ్రైను సులభంగా చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లెగ్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె- 2 టీ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, పచ్చిమిర్చి – 2, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6, కొత్తిమీర – కొద్దిగా, పుదీనా ఆకులు -10, చికెన్ లెగ్ పీసెస్ – 2, నిమ్మరసం – అర చెక్క, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు -తగినంత, ధనియాల పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, పెరుగు – 2 టీ స్పూన్స్.
చికెన్ లెగ్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాట వేసి వేయించాలి. వీటిని మెత్తబడే వరకు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అల్లం, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో చికెన్ లెగ్ పీసెస్ కు గాట్లు పెట్టి తీసుకోవాలి. తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ తో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి లెగ్ పీసెస్ కు పట్టేలా బాగా కలుపుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి 3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అంత సమయం లేని వారు కనీసం గంటన్నర సమయమైనా మ్యారినేట్ చేసుకోవాలి.
తరువాత కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక లెగ్ పీసెస్ ను గ్రేవీతో సహా వేసుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి వేయించాలి. ఈ లెగ్ పీసెస్ ను 4 నిమిషాలకొకసారి మరో వైపుకు తిప్పుతూ వేయించాలి. ఇలా 20 నుండి 25 నిమిషాల పాటు చికెన్ లెగ్ పీసెస్ మెత్తగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని నిమ్మరసం, ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. వీకెండ్స్ లో లేదా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా చికెన్ లెగ్ పీస్ ఫ్రైను తయారు చేసుకోవచ్చు.