Chinthakaya Pachadi : మనం కొన్ని రకాల పచ్చళ్లను సంవత్సరం పాటు నిల్వ ఉండేలా తయారు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి నిల్వ పచ్చళ్లలో చింతకాయ పచ్చడి కూడా ఒకటి. పచ్చి చింతకాయలతో తయారు చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటాయి. ఈ పచ్చడిని మనం ఇతర పచ్చళ్ల తయారీలో చింతపండుకు బదులుగా ఉపయోగించుకోవచ్చు. దొండకాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి, దోసకాయ పచ్చడి రకరకాల పచ్చళ్ల తయారీలో మనం చింతకాయ పచ్చడిని ఉపయోగించుకోవచ్చు. ఈ చింతకాయపచ్చడి తయారు చేయడం చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా ఈ పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చి చింతకాయలతో సంవ్సతరం పాటు నిల్వ ఉండేలా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతకాయలు – కిలో, రాళ్ల ఉప్పు – 200 గ్రా., పసుపు – ఒక టేబుల్ స్పూన్, మెంతిపొడి – ఒక టేబుల్ స్పూన్.
చింతకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా చింతకాయలను శుభ్రంగా కడిగి అతడి పోయేలా తుడవాలి. తరువాత వీటిని అరగంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. తరువాత చింతకాయ ఈనెను తీసి వేయాలి. ఇప్పుడు ఒక రోలును తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రోట్లో చింతకాయలను వేసి కచ్చా పచ్చాగా దంచాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసుకుంటూ చింతకాయలను కచ్చా పచ్చాగా దంచాలి. ఇలా దంచిన తరువాత ఈ చింతకాయ పచ్చడిని గాజు సీసాలో పెట్టి వారం రోజుల పాటు ఊరబెట్టాలి. వారం రోజుల పాటు ఈ పచ్చడిని మరలా రోట్లో వేసుకుని దంచాలి. ఇలా దంచేటప్పుడు ఇందులో ఉండే గింజలను, ఈనెలను తీసేసి పచ్చడిని మెత్తగా దంచుకోవాలి.
ఇలా పచ్చడిని అంతా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మెంతిపొడి వేసి కలుపుకోవాలి. తరువాత ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి మూత పెట్టాలి. ఈ పచ్చడిని తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల చింతకాయ పచ్చడి తయారవుతుంది. ఇలా ఒక్కసారే చింతకాయ పచ్చడిని తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు పడితే అప్పుడు రకరకాల రుచికరమైన పచ్చళ్లను తయారు చేసుకుని తినవచ్చు.