Cool Buttermilk : వేసవి కాలంలో మనకు రోడ్ల పక్కన బండ్ల మీద ఎక్కువగా లభించే పదార్థాల్లో బటర్ మిల్క్ కూడా ఒకటి. చాలా మంది వేసవి తాపం నుండి బయటపడడానికి చల్లచల్లటి బటర్ మిల్క్ ను తాగుతూ ఉంటారు. పెరుగుతో చేసే ఈ బటర్ మిల్క్ ను తాగడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం ఇంట్లో కూడా ఈ బటర్ మిల్క్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెరుగు ఉండాలే కానీ దీనిని మనం నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా బటర్ మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ మిల్క్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – ఒక కప్పు, అల్లం – ఒక ఇంచు ముక్క, పచ్చిమిర్చి – 1, పుదీనా – రెండు టేబుల్ స్పూన్స్, కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, చల్లటి నీళ్లు – రెండున్నర కప్పులు, ఉప్పు – తగినంత, నిమ్మరసం – అర చెక్క.
బటర్ మిల్క్ తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత గిన్నెలో పెరుగును తీసుకోవాలి. దీనిని కవ్వంతో గడ్డలు లేకుండా కలుపుకోవాలి. తరువాత చల్లటి నీళ్లను పోసి కలపాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుతో పాటు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. తరువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చల్లచల్లటి బటర్ మిల్క్ తయారవుతుంది. వేసవి కాలంలో ఎండ తీవ్రత నుండి బయటపడడానికి ఈ విధంగా బటర్ మిల్క్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.