Crabs Fry : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారంలో పీతలు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. పీతలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మాన్ని సంరక్షించడంలో పీతలు మనకు ఉపయోగపడతాయి. అలాగే ఊబకాయం సమస్యను తగ్గించడంలో, క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గించడంలో పీతలు మనకు దోహదపడతాయి. చాలా మంది వీటితో ఫ్రైను తయారు చేసుకుని తింటూ ఉంటారు. పీతల ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులభంగా పీతల ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పీతల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పీతలు – అర కిలో, చిన్న ఉల్లిపాయలు – 8, సోంపు గింజలు – ముప్పావు టీ స్పూన్, జీలకర్ర – ముప్పావు టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన టమాట – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 150 ఎమ్ ఎల్, మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్.
పీతల వేపుడు తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయలు, సోంపు గింజలు, జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, అల్లం పేస్ట్ వేసి కలపాలి. ఈ టమాట ముక్కలను మెత్తగా అయ్యే వరకు వేయించిన తరువాత కారం, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి. తరువాత శుభ్రపరుచుకున్న పీతలు, ఉప్పు వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. దీనిని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించిన తరువాత మూత తీసి నీరు అంతా పోయేలా వేయించాలి. తరువాత మిరియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పీతల ఫ్రై తయారవుతుంది. దీనిని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పీతలతో ఫ్రైను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.