Daddojanam : మనం ప్రతిరోజూ పెరుగును ఆహారంగా తీసుకుంటాము. పెరుగులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పెరుగును తినడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పెరుగుతో మనం రుచిగా ఉండే దద్దోజాన్ని కూడా తయారు చేస్తూ ఉంటాము. దీనిని దేవాలయాల్లో ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారు. దద్దోజనం చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, కమ్మగా ఉండే ఈ దద్దోజనం తయారీ విధానాన్ని అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దద్దోజనం తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – 150 గ్రా., పెరుగు – 250 గ్రా., అల్లం తరుగు – ఒక టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, మిరియాలు – 10, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత.
దద్దోజనం తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని చల్లగా చేసుకోవాలి. తరువాత అన్నంలో పెరుగు, ఉప్పు, అల్లం తరుగు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుని కలపాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, మిరియాలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఈ తాళింపును అన్నంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దద్దోజనం తయారవుతుంది. దీనిని తయారు చేసుకోవడానికి కమ్మగా ఉండే తియ్యటి పెరుగును ఉపయోగించాలి. ఈ విధంగా పెరుగుతో దద్దోజాన్ని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.