Dal Rice : మనం కంది పప్పుతో రకరకాల పప్పు కూరలను, సాంబార్, పప్పు చారు వంటివి తయారు చేసుకుని తీసుకుంటాం. కందిపప్పులో మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ తో పాటు ప్రోటీన్స్ వంటి ఇతర పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇతర పప్పు దినుసులతో చేసిన వంటకాల కంటే కందిపప్పుతో చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటుంది. పప్పు కూరలే కాకుండా కందిపప్పుతో మనం దాల్ రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. దాల్ రైస్ ను మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. దాల్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. ఏ వంట చేయాలో తోచనప్పుడు ఇలా దాలమ్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ దాల్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక చిన్న గ్లాస్, కంది పప్పు – అర గ్లాస్, నీళ్లు – 4 గ్లాసులు, తరిగిన టమాటాలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, చింతపండు – రెండు రెబ్బలు, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 3, ఎండుమిర్చి – 1, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
దాల్ రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో బియ్యం, కందిపప్పు వేసి శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లను పోసుకోవాలి. ఇందులో కొత్తిమీర, ఉప్పు తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మధ్యస్థ మంటపై ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. దీనిలో మరో అర గ్లాస్ నీళ్లు పోసి కలిపి మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తరువాత ఈ తాళింపును ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసుకుని కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ రైస్ తయారవుతుంది. బియ్యాన్ని ఏ గ్లాస్ తో తీసుకుంటామో నీటిని, కందిపప్పును కూడా అదే గ్లాస్ తో తీసుకోవాలి. దీనిని నెయ్యి వేసుకుని ఊరగాయ, అప్పడం, వడియాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సమయం లేనప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా రుచిగా దాల్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఇష్టంగా తింటారు.