Dates Kheer : ఖర్జూరాలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటిని అందరూ ఇష్టంగా తింటుంటారు. అయితే ఖర్జూరాలతో పలు వంటలను కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటితో తీపి వంటకాలను చేస్తుంటారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక ఖర్జూరాలతో ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేయవచ్చు. ఇది కమ్మని రుచిని కలిగి ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖర్జూరాల పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
గింజల్లేని ఖర్జూరాలు – 12, చిక్కని పాలు – మూడున్నర కప్పులు, వాల్ నట్స్ – పావు కప్పు, పొట్టు తీసిన బాదం పలుకులు – పావు కప్పు, డ్రై ఫ్రూట్స్ – గుప్పెడు, యాలకుల పొడి – అర టీస్పూన్, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు.
ఖర్జూరాల పాయసాన్ని తయారు చేసే విధానం..
అర కప్పు గోరు వెచ్చని పాలలో బాదం, ఖర్జూరాలు, వాల్ నట్స్ ను వేసి నానబెట్టుకోవాలి. పావు గంటయ్యాక అన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక బాదం, కిస్మిస్ పలుకుల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన పాలు పోయాలి. అవి మరిగి సగం అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ పలుకులతోపాటు ఖర్జూరాల ముద్ద, యాలకుల పొడి వేసి అన్నింటినీ కలపాలి. అంతే.. రుచికరమైన ఖర్జూరాల పాయసం రెడీ అవుతుంది. దీన్ని చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో నట్స్, డ్రై ఫ్రూట్స్, పాలు ఉంటాయి కనుక మనకు పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.