Currency Notes : దేశంలో నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు.. దొంగ నోట్లను అరికట్టేందుకు అప్పట్లో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం విదితమే. రూ.500, రూ.1000 నోట్లను ఆయన రద్దు చేశారు. తరువాత వాటి స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు. వీటితోపాటు ఇతర నోట్ల డిజైన్, ఆకారం, రూపురేఖలను కూడా మార్చారు. అయితే కొత్త నోట్లపై పక్కన చివరి భాగంలో లైన్స్ (గీతలు) ఉంటాయి కదా. మీరు గమనించే ఉంటారు. అయితే ఆ గీతలకు అర్థం ఏమిటి ? వాటిని ఎందుకు ముద్రిస్తారు ? వాటితో ఏం తెలుస్తుంది ? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త కరెన్సీ నోట్లపై ఉన్న గీతల వల్ల అంధత్వం ఉన్నవారు సులభంగా ఆ నోట్లను గుర్తించగలుగుతారు. ఆ గీతలను చేత్తో తాకి వారు ఆ నోటు ఏదో గుర్తు పడతారు. అందుకనే ఆ గీతలను నోట్లపై ముద్రిస్తున్నారు. ఇక రూ.100 నోటు మీద నాలుగు గీతలు ఉంటాయి. అదే రూ.200 నోటు అయితే నాలుగు గీతల మధ్యలో రెండు వృత్తాలు కూడా ఉంటాయి.
ఇక రూ.500 నోటు మీద 5 గీతలు ఉంటాయి. అలాగే రూ.2000 నోటు మీద 7 గీతలు ఉంటాయి. దీంతో ఆ గీతలను చేత్తో తాకితే అది ఏ నోటో సులభంగా తెలిసిపోతుంది. దివ్యాంగులకు సౌకర్యంగా ఉండేందుకు గాను ఈ విధంగా నోట్లపై గీతలను ముద్రిస్తూ వస్తున్నారు. ఇదీ.. వాటి వెనుక ఉన్న అసలు విషయం.