Dondakaya Masala Curry : మనం దొండకాయలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. కారణం తెలియదు కానీ దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. దొండకాయలను తినడం వల్ల కూడా మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దొండకాయతో చేసుకోదగిన వంటల్లో దొండకాయ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా దీనిని తయారు చేసుకోవచ్చు. దొండకాయతో మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – పావు కిలో, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, లవంగాలు – 2, దాల్చిన చెక్క ముక్క – 1, యాలకులు – 2, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన టమాట – 1, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
దొండకాయ మసాలా కూర తయారీ విధానం..
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి చివర్లను తొలగించాలి. తరువాత ఒక్కో దొండకాయను చివరి వరకు కట్ చేయకుండా నిలువుగా నాలుగు భాగాలుగా చేసుకోవాలి. ఇలా తరిగిన దొండకాయలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ పసుపును, కొద్దిగా ఉప్పును వేయాలి. ఇవి రెండు కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో పల్లీలు, ఎండు కొబ్బరిముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించుకోవాలి.
తరువాత ధనియాలు వేసి వేయించుకోవాలి. తరువాత అర టీ స్పూన్ జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. చివరగా నువ్వులను వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా చల్లగా అయిన తరువాత జార్ లోకి తీసుకుని మొదటగా మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత దొండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తరువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే కళాయిలో అవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత టమాట ముక్కలను వేసి కలిపి మూత పెట్టాలి. ఈ ముక్కలు మెత్తగా అయిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ తో పాటు కొద్దిగా నీటిని కూడా వేసి కలపాలి.
ఇప్పుడు కళాయిపై మూత ఉంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ముందుగా వేయించిన దొండకాయలను వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక కప్పు నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత గరం మసాలా పొడిని వేసి మరో నిమిషం పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కూర తయారవుతుంది. ఈ కూరను అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన మసాలా కూరను దొండకాయను తినని వారు కూడా ఇష్టంగా తింటారు.