Dondakaya Ulli Karam : దొండకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దొండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దొండకాయలను కూడా ఇతర కూరగాయల వలె తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. దొండకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో దొండకాయ ఉల్లికారం కూడా ఒకటి. ఉల్లికారం వేసి చేసే ఈ దొండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలను ఇష్టపడని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారు. ఈ దొండకాయ వేపుడుతో కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో రుచిగా ఉండే ఈ దొండకాయ ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ ఉల్లికారం తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – పావుకిలో, నూనె -ఒక టీ స్పూన్, జీలకర్ర -ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 10, తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు – ఒక రెమ్మ, చింతపండు రసం – 2 టేబుల్ స్పూన్స్.
దొండకాయ ఉల్లికారం తయారీ విధానం..
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి మనకు కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత ఉప్పు, పసుపు వేసి వేయించాలి. వీటిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలను, ఉప్పు వేసి కలపాలి.
వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలను పూర్తిగా మగ్గించాలి. దొండకాయ ముక్కలు వేగిన తరువాత కరివేపాకు వేసికలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం, చింతపండు రసం వేసి కలపాలి. దీనిని చిన్న మంటపై నూనె పైకి తేలే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయతో ఈ విధంగా చేసిన కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.