Egg Drop Curry : ఎగ్ డ్రాప్ కర్రీ.. కోడిగుడ్లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. తరచూ ఒకే రకం వంటలు కాకుండా కోడిగుడ్లతో ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఒక్కసారి ఈ కర్రీని రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడక మానరు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ డ్రాప్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ డ్రాప్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
టమాటాలు – 4, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 5, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు- తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అరటీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, కోడిగుడ్లు – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఎగ్ డ్రాప్ కర్రీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లను పోయాలి. తరువాత టమాటాలకు చిన్నగా గాట్లు పెట్టుకుని వేసుకోవాలి. వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత టమాటాలపై ఉండే పొట్టును తీసేసి వాటిని జార్ లో వేసి ఫ్యూరీలాగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలను పూర్తిగా మగ్గించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న టమాట ఫ్యూరీని వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత గంటతో టమాట మిశ్రమాన్ని పక్కకు జరుపుకుంటూ కోడిగుడ్లను పక్కకు వేసుకోవాలి. వీటిని కదపకుండా అలాగే ఉంచి మూత పెట్టాలి. దీనిని చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత కోడిగుడ్లను నెమ్మదిగా మరో వైపుకు తిప్పుకోవాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ డ్రాప్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసిన ఎగ్ కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.