బుల్లితెరపై ఒకప్పుడు తన హవా చాటిన నటుడు ప్రభాకర్. టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ఆయనను ముద్దుగా పిలుచ్చుకుంటారు. ఈటీవీ బిగినింగ్ రోజుల్లో రామోజీరావు కుమారుడు సుమన్ , ప్రభాకర్ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్‌కే ఆయన ఎక్కువ విలువనిచ్చే వారని ఇండస్ట్రీలో టాక్. ఏళ్లుగా ఎన్నో సూపర్‌హిట్ సీరియల్స్‌లో, సినిమాలలో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటిపేరుగా మార్చుకున్న ప్రభాకర్ ఇప్పుడు ఇతర ఛానెల్స్‌లో కూడా అడపాదడపా కనిపించి సందడి చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ని హీరోగా పరిచయం చేశారు.
ప్రభాకర్ ఆయన భార్య మలైజాలు మీడియా సమావేశం పెట్టి మరి ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఆ సమయంలో చంద్రహాస్ హావభావాలు, యాటిట్యూడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో మనోడిని ఓ రేంజ్లో ఆడేసుకున్నారు. అయితే కొడుక్కి మంచి బ్రేక్ ఇవ్వాలని ప్రభాకర్ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం సొంతంగా బ్యానర్ ఓపెన్ చేసి ‘రామ్ నగర్ బన్నీ ‘ అనే సినిమా నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి అశ్విన్ హేమంత్ సంగీతాన్ని అందిస్తుండగా.. అక్షర్ అలీ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మాస్‌లుక్‌లో ఉన్న చంద్రహాస్ గ్లిమ్స్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయగా, దీనికి మంచి రెస్పాన్సే వచ్చింది.
అయితే ప్రభాకర్ ఇటీవల పలు ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఓ ఇంటర్వ్యూలో తాను మెగాస్టార్ చిరంజీవికీ వీరాభిమానిని అని చెప్పారు. చిన్నప్పటి నుంచి చిరు సినిమాలు చూస్తూ పెరిగిన తాను చిరు రాజకీయాలలోకి వెళ్లి సినిమాలు చేయకపోతే నేను ఎలా బ్రతకాలి అని చాలా బాధపడ్డారట. చిరు సినిమాలు మానేసారని తెలిసి రెండు రోజుల పాటు అన్నం కూడా తినలేదని ప్రభాకర్ అన్నాడు. అయితే అదే సమయంలో చిరు తనయుడు రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి మగధీరతో అదిరిపోయే హిట్ కొట్టాడు. చిరంజీవి కొడుకుగా పుట్టాడు, పేరు నిలబెట్టాలి.. ఒక చిన్న తప్పు చేసినా కష్టమే. పేరును కాపాడటం చాలా పెద్ద బాధ్యత కానీ రామ్ చరణ్ ఆ ప్రెజర్ తీసుకుని సక్సెస్ అయ్యాడని ప్రభాకర్ ప్రశంసించారు.