దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని కేంద్రం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్ బైక్‌లను, కార్లను విడుదల చేస్తూ వస్తున్నాయి. వాటిపై కేంద్రం సబ్సిడీని కూడా అందిస్తోంది. దీంతో ఈవీల వినియోగం పెరిగింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పలు కంపెనీలు ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను విడుదల చేస్తున్నాయి. వీటికి వినియోగదారుల నుంచి ఆదరణ సైతం లభిస్తోంది. ఇక అందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్తగా ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను లాంచ్ చేసింది. వీటి వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..
టాటా మోటార్స్ కంపెనీ.. స్ట్రైడర్ సిరీస్‌లో రెండు సరికొత్త మోడల్ ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను విడుదల చేసింది. వోల్టిక్ ఎక్స్, వోల్టిక్ గో పేరిట ఈ సైకిల్స్‌ను లాంచ్ చేశారు. వీటిని 15 శాతం డిస్కౌంట్ ధరకు అందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు గాను ఈ సైకిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని టాటా మోటార్స్ తెలియజేసింది.
ఇక వీటిల్లో 48వోల్టుల స్ల్పాష్ ప్రూఫ్ బ్యాటరీ ఉటుంది. ఇది కేవలం కొన్ని గంటల్లోనే ఫుల్ చార్జింగ్ అవుతుంది. దీంతో 40 కిలోమీటర్లు వెళ్లవచ్చు. అయితే ఈ రెండు సైకిల్స్‌కు సంబంధించి ధర, ఇతర స్పెసిఫికేషన్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. అలాగే ఈ సైకిల్స్ మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో కూడా తెలియజేయలేదు. కానీ అతి త్వరలోనే అవి లభ్యమయ్యే చాన్స్ ఉంది.