Fish Fry Masala Curry : చేపలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. చేపలల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, శరీరానికి ముఖ్యమైన పోషకాలను అందించడంలో ఇలా అనేక రకాలుగా చేపలు మనకు సహాయపడతాయి. చేపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. తరుచూ ఒకేరకంగా కాకుండా చేపలతో మరింత రుచిగా, కమ్మగా కింద చెప్పిన విధంగా మసాలా కర్రీని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని తయారు చేయడం చాలా సులభం. అందరికి నచ్చేలా సులభంగా ఫిష్ ప్రై మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిష్ ఫ్రై మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 5 టేబుల్ స్పూన్స్, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు లీటర్, కొబ్బరి పాలు – 3 టేబుల్ స్పూన్స్.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి- 10, మెంతులు – చిటికెడు, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 2, వెల్లుల్లి రెబ్బలు – 8, అల్లం – ఒక ఇంచు ముక్క,చింతపండు – నిమ్మకాయంత.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – 700 గ్రా., నిమ్మరసం – అర చెక్క, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్.
ఫిష్ ఫ్రై మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో చేప ముక్కలను తీసుకుని అందులో మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు వేసి కలపాలి. ఈ చేప ముక్కలను అరగంట పాటు మ్యారినేట్ చేసిన తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత చేప ముక్కలను వేసి వేయించాలి. వీటిని రెండు వైపులా రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని ఇందులోనే మిగిలిన పదార్థాలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన చేప ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి చేప ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత కొబ్బరి పాలు వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రై మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.