Dishti : మనలో సహజంగానే చాలా మంది అప్పుడప్పుడు దిష్టి అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ రోజు ఉదయం లేచి ఎవరి ముఖం చూశామో గానీ దిష్టి బాగా తగిలిందని అంటుంటారు. అందుకనే మన ఇంట్లో మహిళలు ఉప్పు, చెప్పులు, చీపురుకట్ట వంటి వాటితో దిష్టి తీస్తుంటారు. అయితే దిష్టి అంటే ఏమిటంటే.. మనలో ప్రతి ఒక్కరిలోనూ విద్యుత్ ప్రవహిస్తుంటుంది. కానీ దిష్టి కళ్లు ఉన్నవారి వల్ల వారి చూపులకు ఇతరుల్లో ఉండే ఆ విద్యుత్ ప్రవాహం దెబ్బ తింటుంది. అది వ్యతిరేక దిశలో ప్రవహించడం మొదలవుతుంది. దీంతో దిష్టి తగిలిందని అంటారు. అప్పుడు మనకు ఉన్నట్లుండి సడెన్‌గా జ్వరం రావడం, వాంతులు కావడం, వికారం వంటివి కనిపిస్తాయి. ఇలా జరిగితే దిష్టి తగిలిందని భావించి వెంటనే దిష్టి తీయాలి. అలాగే పిల్లలకు కూడా దిష్టి తగులుతుంటుంది.
చిన్నారులకు తగిలే దిష్టి పోయేందుకు వేరే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అదేమిటంటే.. కుంకుమతో కలిపి మూడు అన్నం ముద్దలను తయారు చేయాలి. ఒక హారతి పళ్లెం తీసుకుని దాంట్లో నీళ్లు పోసి కుంకుమ వేసి కలపాలి. ఇందులో ముందుగా తయారు చేసిన అన్నం ముద్దలను వేయాలి. తరువాత పళ్లెంతో మూడు సార్లు దిష్టి తీయాలి. అనంతరం ఆ నీళ్లను, ముద్దలను ఎవరూ నడవని ప్రదేశంలో పారబోయాలి. ఇలా చేస్తే పిల్లలపై ఉండే దిష్టి పోతుంది.
ఇక మన ఇళ్లకు, మనకు, వ్యాపారాలకు కూడా దిష్టి తాకుతుంది. ఇది తొలగిపోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇళ్లకు తగిలే దిష్టి పోయేందుకు గాను ఇంటి ప్రధాన ద్వారం వద్ద బయటి వైపు ఒక బూడిద గుమ్మడికాయను వేలాడదీయాలి. ఇది క్రమంగా కుళ్లిపోతూ ఉంటుంది. అంటే దిష్టి దాని ద్వారా బయటకు పోతుందని అర్థం. అది పూర్తి కుళ్లిపోకముందే ఇంకో కాయను తెచ్చి దాని స్థానంలో కట్టాలి. ఇలా చేస్తుంటే మన ఇంటికి దిష్టి తగలదు.
ఇక మనకు కలిగే దిష్టిపోవాలంటే ఒక కోడిగుడ్డును తీసుకుని దాన్ని 7 సార్లు తిప్పి నాలుగు రోడ్లు కలిసే కూడలిలో పగలగొట్టాలి. అలాగే కొత్త వస్త్రాలు ధరించినప్పుడు దిష్టి తగలకుండా ఉండాలంటే.. వాటిల్లో కొన్ని పోగులను తీసి మంటలో కాల్చాలి. లేదా వస్త్రానికి ఎవరూ చూడని చోట చిన్న కాటుక చుక్క పెట్టాలి. అలాగే భోజనం వల్ల దిష్టి తగలొద్దని అనుకుంటే.. మనం తినే ఆహారంలో ముందుగా ఒక ముద్దను తీసి పక్కన పెట్టాలి. మనం తినేటప్పుడు ఎవరైనా వస్తే వారికి కూడా భోజనం పెట్టాలి. ఇంటికి వచ్చే వారికి పండో, మిఠాయో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మనకు దిష్టి తగలదు.
దుకాణాలకు ఉండే దిష్టి పోవాలంటే సాయంత్రం పూట పసుపు నీళ్లు చల్లి అవి తడి ఆరి ఎండిపోయాక లైట్లు వేయాలి. అలాగే నిమ్మకాయలు, మిరపకాయలను మూడు చొప్పున తీసుకుని దిష్టి తీయాలి. దుకాణం ఎదుట గుమ్మడికాయలను పగలగొట్టాలి. ఇలా చేయడం వల్ల దిష్టి తాకదు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.