Function Style Sambar : మనకు ఫంక్షన్ లల్లో వడ్డించే వాటిలో సాంబార్ కూడా ఒకటి. అన్నంతో తినడానికి , టిపిన్స్ తో తినడానికి సాంబార్ చాలా చక్కగా ఉంటుంది. చాలా మంది సాంబార్ ను లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు.ఫంక్షన్ లల్లో చేసే విధంగా ఎంతో రుచిగా ఉండే ఈ సాంబార్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. తరుచూ చేసే సాంబార్ కంటే కింద చెప్పిన విధంగా తయారు చేసే ఈ సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. మరింత రుచిగా ఫంక్షన్ లల్లో చేఏ విధంగా సాంబార్ ను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫంక్షన్ స్టైల్ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన కందిపప్పు – 150 గ్రా., నీళ్లు – ఒకటింపావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 2 టీ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, నానబెట్టిన చింతపండు – 25 గ్రా., తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, ఎండుమిర్చి – 3, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, పొడవుగా తరిగిన ఉల్లిపాయ- 1, తరిగిన మునక్కాయలు – 2, పొడవుగా తరిగిన టమాట -1, సొరకాయ ముక్కలు – అర కప్పు, పొడవుగా తరిగిన బంగాళాదుంప – 1, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, సాంబార్ మసాలా పొడి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

ఫంక్షన్ స్టైల్ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పు, నీళ్లు, పసుపు, నూనె, కరివేపాకు వేసి మూత పెట్టాలి. తరువాత ఈ పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి సగానికి పైగా వేగిన తరువాత మునక్కాయ ముక్కలు, టమాట ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, సొరకాయ ముక్కలు వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ఉప్పు, పసుపను, కారం వేసి కలపాలి.
తరువాత చింతపండు రసం, ముప్పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ముక్కలు సగానికి పైగా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తరువాత ఉడికించిన పప్పు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. సాంబార్ ఉడకడం మొదలయ్యాక సాంబార్ పొడి వేసి కలపాలి. తరువాత మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సాంబార్ తయారవుతుంది. ఇలా తయారుచేసిన సాంబార్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.