Calcium Rich Foods : ఎముకలు బలంగా ఉండడానికి, పిల్లలు చక్కగా ఎదగడానికి క్యాల్షియం ఎంతో అవసరం. మన శరీరానికి అవసరమైన పోషకాల్లో ఇది కూడా ఒకటి. పాలను తాగడం వల్ల మన శరీరానికి తగినంత క్యాల్షియం లభిస్తుందని మనలో చాలా మందికి తెలుసు. మనలో చాలా మంది రోజూ పాలు తాగుతూ ఉంటారు కూడా. పిల్లలకు కూడా రోజూ పాలను ఆహారంలో భాగంగా ఇస్తూ ఉంటారు. మన శరీరానికి పెద్దలకు రోజూకు 450 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. అదే 21 సంవత్సరాల లోపు వారికి రోజుకు 600 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజుకు 900 మిల్లీ గ్రాముల క్యాల్షియం అవసరమవుతుంది.
మనం ఆహారంగా తీసుకునే 100 గ్రాముల గేదె పాలల్లో220 మిల్లీ గ్రాముల క్యాల్షియం, అదే నీళ్లు కలిపిన గేదె పాలల్లో 120 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అలాగే 100 గ్రాముల ఆవు పాలల్లో 120 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది. మన శరీరానికి తగినంత క్యాల్షియం కావాలంటే పాలను కొనుగోలు చేయడానికి మనం ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కనుక మనం పాలకు బదులుగా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవడం మంచిది. ఇలా పాలకు బదులుగా ఇతర ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత క్యాల్షియం తక్కువ ఖర్చులో లభిస్తుంది. పాలల్లో కంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఇతర ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
100 గ్రాముల గోరు చిక్కుళ్లల్లో 130 గ్రాములు, 100 గ్రాముల శనగలల్లో 202 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల బాదంపప్పులో 230 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల సోయా చిక్కుళ్లల్లో 240 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల ఉలవల్లల్లో 287 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల రాగులల్లో 344 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల గోంగూరలో 344 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల మెంతికూరలో 395 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల తోటకూరలో 397 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల ఎండుకొబ్బరిలో 400 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల మునగాకులో 440 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల పొన్నగంటి కూరలో 510 గ్రాములు, 100 గ్రాముల కరివేపాకులో 830 గ్రాములు, 100 గ్రాముల నువ్వులల్లో 1450 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
మన శరీరానికి తగినంత క్యాల్షియం కావాలంటే మనం రోజుకు అర లీటర్ పాలు తాగాల్సి ఉంటుంది. ఇంట్లో అందరికి అరలీటర్ చొప్పున పాలను ఇవ్వడానికి మనం ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతకాలంలో పాలను కూడా కల్తీ చేస్తున్నారు. ఇలా కల్తీ చేసిన పాలను తాగడం వల్ల మనం అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక పాలకు బదులుగా ఇలా క్యాల్షియం ఎక్కువగా ఉండే ఇతర ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.