Garlic Egg Rice : మనం కోడిగుడ్లతో చేసే వంటకాల్లో ఎగ్ రైస్ కూడా ఒకటి. ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు దీనిని మనం తయారు చేస్తూ ఉంటాము కూడా. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా వివిధ రుచుల్లో కూడా మనం ఈ ఎగ్ రైస్ ను తయారు చేసుకోవచ్చు. వాటిలో గార్లిక్ ఎగ్ రైస్ కూడా ఒకటి. వెల్లుల్లి ప్లేవర్ తో ఈ ఎగ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. మిగిలిన అన్నంతో కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ గార్లిక్ ఎగ్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గార్లిక్ ఎగ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
వెల్లుల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – ఒక ఈ స్పూన్, అన్నం – 200గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 3, ఉప్పు – తగినంత, గరం మసాలా – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – అర చెక్క.
గార్లిక్ ఎగ్ రైస్ తయారీ విధానం..
ముందుగా వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. తరువాత రెడ్ చిల్లీ ప్లేక్స్ వేసి కలపాలి. వీటిని ఒక పక్కకు అని ముందుగా సిద్దం చేసుకున్న కోడిగుడ్డు వేసుకోవాలి. ఇది వేగిన తరువాత ముక్కలుగా చేసి కలుపుకోవాలి. తరువాత అన్నం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గార్లిక్ ఎగ్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చాలా సులభంగా తక్కువ సమయంలోనే రుచిగా ఎగ్ రైస్ ను తయారు చేసి తీసుకోవచ్చు.