Guntagalagaraku Pachadi : మన జుట్టుకు ఎంతో మేలు చేసే అద్భుతమైన ఔషధమొక్కలల్లో గుంటగలగరాకు మొక్క కూడా ఒకటి. దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందమైన, పొడవైన, నల్లటి జుట్టును సొంతం చేసుకోవచ్చని మనందరికి తెలిసిందే. అయితే చాలా మంది దీనిని జుట్టు సంరక్షణలోనే ఉపయోగిస్తారని భావిస్తారు. కానీ గుంటగలగరాకును ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొట్టలో అల్సర్ సమస్య తగ్గుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ గుంటగలగరాకుతో మనం రుచికరమైన పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నింటిని మనం పొందవచ్చు. గుంటగలగరాకుతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటగలగరాకు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
గుంటగలగరాకు – ఒక కప్పు, పుదీనా – ఒక పెద్ద కట్ట, నూనె -ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 6, చింతపండు – రెండు రెమ్మలు, ఉప్పు- తగినంత, పసుపు – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, బెల్లం – కొద్దిగా.
గుంటగలగరాకు పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించి వీటన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తరువాత పుదీనా, గుంటగలగరాకు వేసి కలపాలి. ఇందులోనే చింతపండు కూడా వేసి కలపాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత మూత పెట్టి ఆకును మెత్తగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ లో ముందుగా వేయించిన దినుసులను తీసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత వేయించిన పుదీనా ఆకులతో పాటు ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గుంటగలగరాకు పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అయితే గుంటగలగరాకు వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. కనుక వేడి శరీరతత్వం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోకపోవడమే మంచిది. ఈ పచ్చడిని నెలకు రెండు నుండి మూత సార్లు తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.