Hayagreeva Prasadam : హయగ్రీవ ప్రసాదం.. శ్రీమహా విష్ణువు అవతారాల్లో ఒకటైన హయగ్రీవ స్వామికి సమర్పించే ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. దీనిని హయగ్రీవ మడ్డి అని కూడా అంటారు. ఈ ప్రసాదాన్ని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తీపి తినాలనిపించినప్పుడు దీనిని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ హయగ్రీవ ప్రసాదాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హయగ్రీవ ప్రసాదం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన శనగపప్పు – అర కప్పు, బెల్లం తరుము – అర కప్పు, పంచదార – పావు కప్పు, నీళ్లు – ఒక కప్పు, పచ్చికొబ్బరి పొడి – అర కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 2టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, గసగసాలు – ఒక టేబుల్ స్పూన్.
హయగ్రీవ ప్రసాదం తయారీ విధానం..
ముందుగా శనగపప్పును మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం తురుము, పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి కళాయిలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో శనగపప్పు వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. బెల్లం మిశ్రమం చిక్కగా అయ్యి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. దీనిని మరింత దగ్గర పడే వరకు ఉడికించి మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేయాలి. తరువాత జీడిపప్పు, ఎండుద్రాక్ష, గసగసాలు వేసి వేయించి ప్రసాదంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల హయగ్రీవ ప్రసాదం తయారవుతుంది. కేవలం ప్రసాదంగానే కాకుండా తీపి తినాలనిపించినప్పుడు ఇలా పచ్చికొబ్బరితో తయరు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.