బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ఆ మాట కొస్తే పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భిన్న రకాలుగా బంగారం ధరలు ఉంటాయి. కానీ అన్ని దేశాల కన్నా దుబాయ్‌లోనే బంగారం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే చాలా మంది అక్కడికి వెళ్లి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే అక్కడ బంగారం ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
దుబాయ్‌లో బంగారం విక్రయాన్ని అక్కడి ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించింది. అందులో భాగంగానే అక్కడ బంగారు బిస్కెట్లను, బార్లను కొంటే ఎలాంటి పన్నులు ఉండవు. ఇతర దేశాల నుంచి వచ్చే బంగారంపై దిగుమతి పన్ను ఉండదు. కేవలం ఆభరణాలపై 5 శాతం మాత్రం పన్నును వసూలు చేస్తారు. కానీ మన దేశంలో అలా కాదు, బంగారాన్ని ఎలా దిగుమతి చేసుకున్నా సరే భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అందుకనే మన దగ్గర బంగారం ఖరీదు ఎక్కువ.
దుబాయ్‌లో ఇన్‌కమ్‌ట్యాక్స్ కూడా కట్టాల్సిన పని ఉండదు. బంగారం కొనుగోలు చేస్తే పన్నులు విధించరు. అక్కడ డిమాండ్ కన్నా సప్లై అధికం. అందువల్ల అక్కడ బంగారం తక్కువ ధరకు లభిస్తుంది. బంగారం విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సంపాదించాలని ఆ ప్రభుత్వం ఎప్పటి నుంచో పన్నులను ఎక్కువగా వసూలు చేయడం లేదు. అందుకనే అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయి.
ఇక దుబాయ్ నుంచి వచ్చే పురుషులు తమ శరీరంపై 20 గ్రాముల వరకు బంగారం ధరించవచ్చు. దాని ఖరీదు రూ.50వేలను మించరాదు. అదే మహిళలు అయితే 40 గ్రాముల వరకు బంగారం ధరించవచ్చు. దాని ఖరీదు రూ.1 లక్ష మించరాదు. ఆ పరిమితి వరకు డ్యూటీ ఫ్రీ అలొవెన్స్ ఉంటుంది. పరిమితి దాటితే కస్టమ్స్ పన్ను వసూలు చేస్తారు. ఒక వ్యక్తి గరిష్టంగా 1 కిలో వరకు బంగారాన్ని దుబాయ్ నుంచి తేవచ్చు. లిమిట్ దాటితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. దుబాయ్‌లో 6 నెలలు అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఉన్న వారు సాధారణ కస్టమ్స్ సుంకం చెల్లించి ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను తేవచ్చు. కానీ 6 నెలల కన్నా తక్కువ కాలం పాటు ఉన్నవారు బంగారాన్ని తెస్తే ఏకంగా 36 శాతం వరకు దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది.