LPG Cylinder : వంట గ్యాస్.. ఈ రోజుల్లో ప్రతి కుటుంబానికి ఇది ఒక నిత్యావసర వస్తువు. వంటగ్యాస్ లేని ఇల్లు ఇప్పుడు ఎక్కడా లేదు. సాధారణంగా మనం గ్యాస్ అయిపోతుంది అనుకోగానే మరో గ్యాస్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ గ్యాస్ సిలిండర్ ని గ్యాస్ సిలిండర్ పై ఉండే వాటిని మాత్రం గమనించం. కానీ అలా గమనించకపోవడం వల్ల చాలా ప్రమాదమే జరిగే అవకావం ఉంటుంది. ప్రతి గ్యాస్ సిలిండర్ పై ఒక కోడ్ ఉంటుంది. కానీ ఈ కోడ్ ను మాత్రం మనలో చాలా మంది గమనించి ఉండరు. ఈ కోడ్ గురించి తెలుసుకోవడం ఇప్పుడు తప్పనిసరైంది.
గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ద్రవ రూపంలో అధిక పీడనంలో ఉంటుంది. సిలిండర్ ను మందమైన లోహంతో చేయడం వల్ల లోపల పీడనం ఎక్కువగా ఉన్నప్పటికీ సిలిండర్ పేలదు. కాలక్రమేణా ఆటు పోట్ల వల్ల కానీ, సిలిండర్ తుప్పు పట్టడం వల్ల కానీ రెగ్యులేటర్ పెట్టే ప్రాంతంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి కొత్త గ్యాస్ సిలిండర్ ను పది సంవత్సరాలకొకసారి, పాత గ్యాస్ సిలిండర్ ను ఏడు సంవత్సరాలకొకసారి సర్వీసింగ్ చేస్తాయి గ్యాస్ సంస్థలు. సర్వీసింగ్ చేసి లోపాలు సరిదిద్దిన తరువాత మళ్లీ ఎప్పుడు సర్వీసింగ్ చేయాలో ఆ వివరాలను ఆ గ్యాస్ సిలిండర్ పై ఓ కోడ్ రూపంలో వేస్తారు.
మనం తీసుకున్న సిలిండర్ ను బాగా చూస్తే ఎ, బి, సి, డి లలో ఏదో ఒక అక్షరం ఉండి దాని పక్కనే ఒక రెండంకెల సంఖ్య ఉంటుంది. ఆ రెండంకెల సంఖ్య ప్రస్తుత శతాబ్దంలోని సంఖ్యను సూచిస్తుంది. ఉదాహరణకు 19 అని ఉంటే 2019 వ సంవత్సనం అని 24 అని ఉంటే 2024 వ సంవత్సరమని అర్థం చేసుకోవాలి. ఆ సంవత్సరాల సంకేతానికి ముందు ఉన్న అక్షరాల్లో ఎ ఉంటే కోడ్ లో సూచించిన సంవత్సరాలు జనవరి నుండి మార్చి వరకు అని అర్థం. అదే బి అని ఉంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు అని అర్థం. అదే సి ఉంటే జులై నుండి సెప్టెంబర్ వరకు అని డి అని ఉంటే అక్టోబర్ నుండి డిసింబర్ వరకు అని అర్థం చేసుకోవాలి.
ఉదాహరణకు మన దగ్గర ఉన్న సిలిండర్ పై డి 22 అని ఉంటే ఆ సిలిండర్ ను 2022 అక్టోబర్ లో సర్వీసింగ్ కు పంపాలి. ఒకవేళ అక్టోబర్ లో సర్వీస్ కు పంపించకపోతే ఆ సిలిండర్ లో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక గ్యాస్ ను తీసుకునేటప్పుడు పరిశీలించి తీసుకోవాలి. ఇలా సర్వీసింగ్ చేయకపోవడం వల్లనే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ మధ్యే జరిపిన పరిశోధనల్లో తేలింది. గ్యాస్ తీసుకునేటప్పుడు ఈ విషయాలను పరిశీలించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.