ప్రస్తుతం మనం వాడుతున్న అనేక రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్నాయి. కల్తీకి కాదేదీ అనర్హం.. అన్నట్లు అన్ని పదార్థాలను కల్తీ చేస్తున్నారు. అయితే కల్తీ పదార్ధాల వల్ల వ్యాపారులకు పెద్ద మొత్తంలో లాభం కలుగుతుంది, కానీ మనకు మాత్రం నష్టం కలుగుతుంది. అలాంటి పదార్థాలను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.
మనం నిత్యం వాడే పదార్థాల్లో ఉప్పు ఒకటి. మార్కెట్లో కల్తీ అయిన ఉప్పును కూడా విక్రయిస్తున్నారు. మనం తినే ఉప్పులో కచ్చితంగా అయోడిన్ ఉండాలి. అయోడిన్ ఉప్పును వాడడం వల్ల శరీర పెరుగుదల సరిగ్గా ఉంటుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. మెదడు అభివృద్ధి చెందుతుంది. కానీ అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ సమస్యలు వస్తాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం మనం తినే ఉప్పులో నిర్దిష్ట మోతాదులో అయోడిన్ ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటి నుంచో ఈ విధానాన్ని పాటిస్తున్నారు.
ఇక నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ చెబుతున్న ప్రకారం మనం వాడే ఉప్పులో అయోడిన్ శాతం 15 పీపీఎంకు మించి ఉండాలి. కొన్ని రకాల కంపెనీల్లో అయోడిన్ 30 పీపీఎం వరకు ఉంటుంది. దాన్ని డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పు అంటారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం అయోడిన్ ఉప్పును విక్రయించడం లేదు. కల్తీ అయిన ఉప్పును విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి ఉప్పును తింటున్న చాలా మంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.