Ragi Rotte : మనం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, రక్తహీనత సమస్య దరి చేరకుండా చేయడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా రాగులు మనకు ఉపయోగపడతాయి. రాగులను పిండిగా చేసి మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రాగిపిండితో చేసుకోదగిన వాటిల్లో రాగి రొట్టె కూడా ఒకటి. రాగి రొట్టె చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులువుగా రాగి రొట్టెను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – 2 కప్పులు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, క్యారెట్ తురుము – పావు కప్పు, ఉప్పు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నెయ్యి -ఒక టేబుల్ స్పూన్, వేడి నీళ్లు – తగినన్ని.
రాగి రొట్టె తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు తగినన్ని వేడి నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ ను లేదా పాలిథిన్ కవర్ ను తీసుకుని దానికి కొద్దిగా నూనె రాయాలి. తరువాత కొద్దిగా పిండిని తీసుకుని చేత్తో రొట్టెలాగా వత్తుకోవాలి. మధ్య మధ్యలో చేతికి పిండి అంటుకుపోకుండా నూనె రాసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక రొట్టెను వేసి కాల్చుకోవాలి. దీనిపై నూనె వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి రొట్టె తయారవుతుంది. దీనిని చట్నీతో లేదా రైతాతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రాగి పిండితో ఈ విధంగా రొట్టెలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.