Kashi : చాలామంది కాశీ వెళ్తూ ఉంటారు. కాశీలో ఓ నాలుగు, ఐదు రోజులు ఉండి పుణ్య గంగా నదిలో స్నానం చేయడం, కాశీ విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్లడం.. ఇలా కొన్ని పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. మీరు కూడా కాశీ వెళ్లాలని అనుకుంటున్నారా..? కాశీ వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోవాలి. మరి కాశీలో ఏమి చేయాలి..? ఏం చేయకూడదు..? అనేది ఇప్పుడే చూసేద్దాం. కాశీకి వెళ్లగానే ఆ విశ్వేశ్వరుడిని తలచుకుని నమస్కరించుకోవాలి. మీరు ఎక్కడైతే బస చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్లి, తర్వాత ముందు మీరు గంగా దర్శనం చేసుకుని, గంగా స్నానం చేయాలి.
ఆ తర్వాత కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి, డుంఠి గణపతి ఉంటారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఉదయం నాలుగు గంటలకి తిరిగి సాయంత్రం 7:30 కి స్పర్శ దర్శనం ఉంటుంది. అన్నపూర్ణాదేవి దర్శనం కూడా చేసుకోవాలి. భాస్కరాచార్య ప్రతిష్ట శ్రీ చక్ర లింగ దర్శనం కూడా తప్పక చేసుకోవాలి. అన్నపూర్ణ ఆలయ ప్రవేశద్వారం దగ్గర కుడివైపు ఉంటుంది. కాశీ వెళ్తే కాశీ విశాలాక్షి దర్శనం, వారాహిమాత ఆలయానికి కూడా వెళ్లాలి. విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డదారి కూడా ఉంటుంది.
వీలైతే మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణిక ఘట్టంలో స్నానం చేయాలి. సాయంత్రం గంగా హారతి ఉంటుంది. కేదారేశ్వర దర్శనం, చింతామణి గణపతి, లోలార్క కుండంలో స్నానం లేక ప్రోక్షణ, దుర్గా మందిరం, గవ్వలమ్మ గుడి, తులసి మానస మందిరం, సంకట మోచన హనుమాన్ మందిరం, తులసీదాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం, తిలాభాండేశ్వర దర్శనం, సార్నాథ్ స్తూపం ఇవన్నీ కూడా కాశీ వెళ్తే తప్పక చూడాల్సిన ప్రదేశాలు.
ఇక్కడ బట్టల షాపింగ్ కూడా బాగుంటుంది. అదే విధంగా ఇక్కడ గంగానది ఘట్టాలు కూడా చాలా ఉంటాయి. అక్కడికి కూడా మీరు వెళ్లొచ్చు. అక్కడ కూడా ఆలయాలు ఎక్కడికక్కడ ఉంటాయి. వీలైతే వాటిని కూడా దర్శించుకోండి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం అదే విధంగా అక్కడ విశ్వనాథ, దుర్గా లక్ష్మీనారాయణ ఆలయం కూడా ఉన్నాయి.