Jackfruit Biryani : బిర్యానీ అనగానే ముందుగా మనకు చికెన్, మటన్ బిర్యానీలే గుర్తుకు వస్తాయి. కానీ వీటికి ఏ మాత్రం తీసిపోకుండా మనం పనసకాయతో కూడా బిర్యానీని తయారు చేసుకోవచ్చు. తమిళనాడు ఫేమస్ వంటకాల్లో ఇది ఒకటి. ఎక్కువగా పెళ్లిళ్లల్లో ఈ బిర్యానీని వడిస్తూ ఉంటారు. పనసకాయలతో చేసే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. పనసకాయ బిర్యానీని రుచిగా, తేలికగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనసకాయ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి పనసకాయ ముక్కలు – 300 గ్రాములు, నూనె – 9 టేబుల్ స్పూన్స్, యాలకులు – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, అనాస పువ్వు – 2, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు – 200 గ్రా., తరిగిన పచ్చిమిర్చి – 4, రాత్రంతా నానబెట్టిన డబుల్ బీన్స్ – అర కప్పు, తరిగిన పెద్ద టమాట – 1, తరిగిన పుదీనా- ఒక చిన్న కట్ట, తరిగిన కొత్తిమీర – ఒక చిన్న కట్ట, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్, నీళ్లు – 100 ఎమ్ ఎల్, పాలు – అర కప్పు, చిలికిన పెరుగు – అర కప్పు, నిమ్మకాయ – 1, గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – రెండున్నర కప్పులు, వేడి నీళ్లు – 5 కప్పులు, నెయ్యి – పావు కప్పు.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్ల మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, యాలకులు – 6, లవంగాలు – 7, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – 1, సోంపు – ఒక టేబుల్ స్పూన్, అనాస పువ్వులు – 2, జాపత్రి – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, పత్తర్ ఫూల్ – కొద్దిగా, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 6.
పనసకాయ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో అల్లం, వెల్లుల్లి, పత్తర్ ఫూల్ తప్ప మిగిలిన మసాలా పదార్థాలన్నీ వేసి దోరగా వేయించాలి. తరువాత పత్తర్ ఫూల్ వేసి వేయించాలి. తరువాత వీటిన్నింటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత పనసకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించి పక్కకు ఉంచాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత డబుల్ బీన్స్ వేసి కలపాలి. వీటిని 4 నుండి 5 నిమిషాల పాటు వేయించిన తరువాత టమాట ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం వేసి కలపాలి. తరువాత నీళ్లు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత వేయించిన పనసకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత పెరుగు, పాలు వేసి కలపాలి. తరువాత నిమ్మకాయ రసం వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత అడుగున ఒకసారి కదిలించాలి. తరువాత పైన నెయ్యి వేసి మూతపెట్టాలి.
ఇప్పుడు బిర్యానీ గిన్నెను అట్ల పెనం మీద ఉంచి 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అరగంట పాటు దీనిని కదిలించకుండా అలాగే ఉంచాలి. అరగంట తరువాత దీనిని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనసకాయ బిర్యానీ తయారవుతుంది. వీకెండ్స్ లో లేదా స్పెషల్ డేస్ లో ఇలా పనసకాయతో బిర్యానీని తయారు చేసుకుని తినవచ్చు. ఈ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.