Diabetes : రోజూ మన శరీరానికి తగినంత నిద్ర, ఆహారం, వ్యాయామం ఎలా అవసరమో.. మనం రోజూ తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను సరైన టైముకు తగిన మోతాదులో తాగడం వల్ల జీవక్రియలు మెరుగ్గా నిర్వర్తించబడతాయి. దీంతో శరీరం తన విధులను తాను సక్రమంగా నిర్వర్తిస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా చాలా మంది నీళ్లను సరిగ్గా తాగడం లేదు. దీంతో అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం పోషకాహారం తింటే సరిపోదు. నీళ్లను కూడా తగినంత మోతాదులో తాగాల్సి ఉంటుంది.
ఇక షుగర్ పేషెంట్లు సాధారణ వ్యక్తుల కన్నా రోజూ కాస్త ఎక్కువ మోతాదులోనే నీళ్లను తాగాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ పేషెంట్లు ఏదైనా తీసుకున్న వెంటనే అందులో ఉన్న కార్బొహైడ్రేట్లను బట్టి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. అయితే గ్లూకోజ్ లెవల్స్ మరీ ఎక్కువైతే శరీరం దాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. ఈ క్రమంలో శరీరంలో తగినంత నీరు ఉండాలి. నీరు లేనట్లయితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అదే నీళ్లను తగిన మోతాదులో తాగితే గ్లూకోజ్ లెవల్స్ పెరిగినప్పుడు ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ మూత్రం ద్వారా సులభంగా బయటకు పోతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక షుగర్ పేషెంట్లు తప్పనిసరిగా ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక స్త్రీలు రోజుకు కనీసం 1.6 లీటర్ల నీటిని తాగాలని.. పురుషులు అయితే రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లను అయినా సరే తాగాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే షుగర్ పేషెంట్లు ఇంకాస్త ఎక్కువ మోతాదులోనే నీళ్లను తాగాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే షుగర్ లేకున్నా సరే నీళ్లను సరైన మోతాదులో తాగితే దాంతో శరీరంలో అధికంగా ఉండే షుగర్ మూత్రం ద్వారా బయటకు వస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. తద్వారా భవిష్యత్తులోనూ షుగర్ రాకుండా ఉంటుంది. అలాగే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కనుక నీళ్లను తాగే విషయంలో ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలను తప్పక పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారవుతారు.