Jeera Rice Recipe : మన వంటింట్లో ఉండే పదార్థాల్లో జీలకర్ర ఒకటి. దీనిని మనం చేసే ప్రతి వంటలోనూ ఉపయోగిస్తూ ఉంటాం. జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికి తెలిసిందే. జీలకర్రలో యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. షుగర్ ను నియంత్రించడంలో, బరువు తగ్గడంలో జీలకర్ర మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీలకర్రను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు ఈ జీలకర్రతో మనం ఎంతో రుచిగా ఉండే జీరా రైస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. జీలకర్రతో సులభంగా, రుచిగా జీరా రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీరా రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతీ బియ్యం – ఒకటిన్నర గ్లాస్, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – 1, యాలకులు – 2, లవంగాలు – 3, బిర్యానీ ఆకు – 1, జీలకర్ర – ఒకటిన్నర టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ, నీళ్లు – మూడు గ్లాసులు, ఉప్పు – తగినంత.

జీరా రైస్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇవి వేడయ్యాక మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నీటిని పోసి అందులోనే తగినంత ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి కలపాలి. దీనిని నీళ్లు అన్ని అయ్యి పోయే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి మూత పెట్టి 6 నుండి 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మూత తీయకుండా 5 నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జీరా రైస్ తయారవుతుంది. దీనిని వెజ్,నాన్ వెజ్ మసాలా కూరలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.