Jonna Idli : ఈ మధ్యకాలంలో ఆహారం మీద అవగాహాన రావడంతో చాలా మంది చిరుధాన్యాలను మరలా ఆహారంగా తీసుకుంటున్నారు. వాటితో వివిధ రకాల అల్పాహారాలను కూడా తయారు చేసి తీసుకుంటున్నారు. ఇలా చిరుధాన్యాలతో చేసుకోదగిన రుచికరమైన అల్పాహారాల్లో జొన్న ఇడ్లీలు కూడా ఒకటి. జొన్న రవ్వతో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు, బరువు తగ్గాలనుకునే వారు ఇలా జొన్నరవ్వతో ఇడ్లీలు తయారు చేసి తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఇడ్లీలను తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ జొన్న ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – ఒక గ్లాస్, సన్నగా ఉండే జొన్న రవ్వ – 3 గ్లాసులు, ఉప్పు – తగినంత.
జొన్న ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా మినపప్పును శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత జొన్న రవ్వను కూడా శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పును జార్ లో లేదా గ్రైండర్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పిండిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత జొన్న రవ్వలో ఉండే నీటిని పిండేసి రవ్వను పిండిలో వేసుకోవాలి. తరువాత దీనిని అంతా కలిసేలా కలుపుకుని మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. తరువాత ఈ పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి వేడి చేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ లను తీసుకుని అందులో మరీ మందంగా మరీ పలుచగా కాకుండా ఇడ్లీ పిండిని వేసుకోవాలి. తరువాత ఈ ప్లేట్ లను ఇడ్లీ కుక్కర్ లో ఉంచి మూత పెట్టి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని మరో రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత ప్లేట్ లో వేసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జొన్న ఇడ్లీలు తయారవుతాయి. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.