Kakarakaya Pulusu : కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. చేదుగా ఉన్నప్పటికి వీటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కాకరకాయలతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. కాకరకాయలతో వేపుడు, కూరలతో పాటు పులుసును కూడా తయారు చేస్తూ ఉంటాం. సరిగ్గా వండాలే కానీ కాకరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. రుచిగా, కమ్మగా, చేదు లేకుండా కాకరకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 400 ఎమ్ ఎల్, కాకరకాయలు – పావుకిలో, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – ఒక రెమ్మ, ఇంగువ – చిటికెడు, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిక్కటి చింతపండు రసం – పావు కప్పు, బెల్లం తురుము – పావు కప్పు, శనగపిండి – 2 టీ స్పూన్స్.
కాకరకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే పొట్టును తీసి అర అంగుళం మందంతో గుండ్రంగా కట్ చేసుకోవాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే పసుపు, కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కాకరకాయ ముక్కలను వడకట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి కలపాలి.
దీనిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. తరువాత చింతపండు రసం, బెల్లం తురుము వేసి కలపాలి. తరువాత 75 ఎమ్ ఎల్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి. 20 నిమిషాల తరువాత శనగపిండిలో నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత ఈ శనగపిండిని పులుసులో వేసి కలపాలి. తరువాత మరో కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈవిధంగా తయారు చేసిన కాకరకాయ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.