Kakarakaya Vepudu : కాకరకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. కాకరకాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో కాకరకాయ వేపుడు కూడా ఒకటి. కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మరికొందరు చేదుగా ఉంటాయనే కారణంగా కాకరకాయలను తినడానికే ఇష్టపడరు. అలాంటి వారు కూడా ఇష్టంగా తినేలా చేదు లేకుండా మనం కాకరకాయ వేపుడును తయారు చేసుకోవచ్చు. పాత పద్దతిలో చేసే ఈ కాకరకాయ వేపుడు చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. కాకరకాయలను ఇష్టపడని వారు కూడా ఈ వేపుడును ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. చేదు లేకుండాపాత కాలంలో మాదిరి కాకరకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – పావుకిలో, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, మజ్జిగ – ఒక కప్పు, నీళ్లు – అరగ్లాస్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, నూనె – పావు కప్పు, కరివేపాకు – 2 రెమ్మలు.
కాకరకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుకొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులోనే కారం, ఉప్పు, వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మజ్జిగ, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, పసుపు వేసి కలపాలి.తరువాత కాకరకాయ ముక్కలు వేసి మజ్జిగ అంతా ఇంకిపోయి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుని వాటిలో ఉండే గింజలను తీసేసి అలాగే వాటిలో ఉండే నీరంతా పోయేలా పిండి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా అయ్యే వరకుబాగా వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.అలాగే పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన కాకరకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.