Kerala Style Split Cake : స్ల్పిట్ కేక్స్.. కేరళ స్పెషల్ తీపి వంటకమైన ఈ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే వీటిని నెలరోజుల పాటు తినవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ కేక్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే ఈ స్ల్పిట్ కేక్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ల్పిట్ కేక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పంచదార – పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, యాలకులు – 3, మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బొంబాయి రవ్వ- ఒక టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్ప్లిట్ కేక్స్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పంచదార, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, పసుపు, నెయ్యి, రవ్వ వేసి బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలను పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండి ముద్దను రెండు భాగాలుగా చేసుకోవాలి. ఒక భాగాన్ని తీసుకుని మిగిలిన భాగంపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు తీసుకున్న పిండిని చేత్తో రోల్ లాగా చేసుకోవాలి. తరువాత దీనిని చేత్తో కొద్దిగా వెడల్పుగా అయ్యేలా వత్తుకోవాలి. తరువాత అంచులను తీసేసి 2 ఇంచుల మందంతో సమానమైన ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తరువాత ఒక్కో ముక్కను తీసుకుని దానిపై ప్లస్ ఆకారంలో కొద్దిగా లోపలికి గాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక కట్ చేసుకున్న కేక్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే స్ల్పిట్ కేక్స్ తయారవుతాయి. ఇలా తయారు చేసిన కేక్స్ ను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.