KFC Style Chicken Drumsticks : కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్.. కెఎఫ్ సి స్టైల్ లో చేసే ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి, స్టాటర్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇంట్లో పార్టీస్ జరిగినప్పుడు వీటిని తయారు చేసి సర్వ్ చేయవచ్చు. వీకెండ్స్ లో స్పెషల్ గా తయారు చేసుకోవాలనుకునే వారు ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ ను తయారు చేసి తీసుకోవచ్చు. ఇంట్లోనే చాలా సులభంగా కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ వింగ్స్ – 6 ( విత్ స్కిన్), ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, బియ్యంపిండి – అర కప్పు, కోడిగుడ్లు – 2, మైదాపిండి – అర కప్పు, ఓట్స్ పౌడర్ – పావు కప్పు, కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, బ్రెడ్ క్రంబ్స్ – అర కప్పు, మిక్డ్స్ హెర్బ్స్ – అర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
కెఎఫ్ సి స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారీ విధానం..
ముందుగా వింగ్స్ ను గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మిరియాల పొడి, పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత బియ్యంపిండి వేసి ముక్కలకు పట్టించి 4 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని బాగా చిలికి పక్కకు ఉంచాలి. తరువాత ఒక ప్లేట్ లో మైదాపిండి, ఓట్స్ పౌడర్, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్, మిక్డ్స్ హెర్బ్స్, కొద్దిగా కారం, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు చికెన్ వింగ్స్ ను ముందుగా కోడిగుడ్డు మిశ్రమంలో ముంచాలి. తరువాత వీటిని మైదాపిండి మిశ్రమంతో బాగా కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వింగ్స్ వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై బాగా వేయించాలి. వీటిని వేయించడానికి కనీసం 15 నుండి 18 నిమిషాల సమయం పడుతుంది. వింగ్స్ చక్కగా వేగిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ వింగ్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.