Kurkure Vadiyalu : ఎండాకాలం వచ్చిందంటే చాలు మన రకరకాల వడియాలను తయారు చేస్తూ ఉంటాం. వడియాలను వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే చాలా మంది వడియాలను పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని అనుకుంటూ ఉంటారు. కానీ పండి ఉడికించే అవసరం లేకుండా ఎండలో ఎండబెట్టే అవసరం లేకుండా మనం చాలా సులభంగా వడియాలను తయారు చేసుకోవచ్చు. పిండిని ఉడికించే అవసరం లేకుండా కుర్ కురే వడియాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కుర్ కురే వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
పలుచటి అటుకులు – అరకిలో, ఉప్పు – తగినంత, చిల్లీ ప్లేక్స్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు.
కుర్ కురే వడియాల తయారీ విధానం..
ముందుగా అటుకులను జల్లించుకోవాలి. తరువాత వీటిని నీటిలో వేసి కడగాలి. కడగడం వల్ల అటుకులు మెత్తబడతాయి. ఇప్పుడు అటుకుల్లో ఉండే నీటిని పిండుతూ వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అటుకుల మిశ్రమంపై మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో లేదా మందంగా ఉండే నూనె ప్యాకెట్ లో పిండిని వేసి కుర్ కురే ఆకారంలో పొడువుగా వడియాలుగా పెట్టుకోవాలి.
వీటిని ఎండలో ఉంచి ఎండబెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ గాలికి కూడా ఆరబెట్టుకోవచ్చు. మరుసటి రోజు వడియాలను వస్త్రం నుండి లేదా కవర్ నుండి వేరు చేసి మరో రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. వడియాలు పూర్తిగా ఎండిన తరువాత గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుర్ కురే వడియాలు తయారవుతాయి. నూనె బాగా కాగిన తరువాత మంటను మధ్యస్థంగా చేసి ఈ వడియాలను వేసి వేయించాలి. ఈ వడియాలు చాలా రుచిగా ఉంటాయి. సైడ్ డిష్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు.