Strawberry Lassi : వేసవి కాలంలో చాలా మంది అనేక శీతల పానీయాలను తాగుతుంటారు. ఎక్కువగా కూల్ డ్రింక్స్‌ను ఈ సీజన్‌లో సేవిస్తుంటారు. అయితే కూల్ డ్రింక్స్ తాగడం వల్ల అప్పటికప్పుడు దాహం తీరినా.. వాటితో మనకు కలిగే నష్టమే ఎక్కువ. కూల్ డ్రింక్స్‌లో కెఫీన్ అధికంగా ఉంటుంది. షుగర్ కూడా ఎక్కువే. అందువల్ల వాటిని ఎక్కువగా తాగితే అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకని సహజసిద్ధమైన పానీయాలను తరచూ తాగాలి. వీటితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక అలాంటి సహజసిద్ధమైన పానీయాల్లో స్ట్రాబెర్రీ లస్సీ కూడా ఒకటి. స్ట్రాబెర్రీలను నేరుగా తినకుండా లస్సీ రూపంలో చేసుకుని తీసుకోవచ్చు. దీంతో పోషకాలకు పోషకాలు, శక్తికి శక్తి రెండూ లభిస్తాయి. అలాగే వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. వేడి తగ్గుతుంది. శరీరం చల్లగా మారుతుంది. ఈ క్రమంలోనే స్ట్రాబెర్రీలతో లస్సీని ఇలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీ లస్సీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – రెండు కప్పులు, స్ర్టాబెర్రీలు – పది, చక్కెర – మూడు టేబుల్ స్పూన్లు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు.
స్ట్రాబెర్రీ లస్సీని తయారు చేసే విధానం..
స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లా కట్ చేయాలి. మిక్సీ జార్‌లో స్ట్రాబెర్రీ ముక్కలు, పెరుగు, చక్కెర వేసుకుని బ్లెండ్ చేయాలి. దీంట్లో కొన్ని చల్లని నీళ్లు కలిపి మళ్లీ బ్లెండ్ చేయాలి. తరువాత గ్లాసుల్లో పోసి పైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు చల్లాలి. చక్కెరకు బదులుగా తేనె కూడా కలుపుకోవచ్చు. దీంతో రుచి అద్భుతంగా ఉంటుంది. ఇలా స్ట్రాబెర్రీలతో లస్సీని తయారు చేసుకుని చల్ల చల్లగా తాగవచ్చు. అయితే చల్లని నీళ్లకు బదులుగా సాధారణ నీళ్లను పోసి కూడా చేసుకోవచ్చు. కానీ చల్లదనం కోసం మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. లేదా ఐస్ క్యూబ్స్ కూడా వేసి తాగవచ్చు. ఇక తీపి ఎక్కువగా కావాలనుకునే వారు ఇంకాస్త చక్కెర జోడించవచ్చు. దీంతో రుచి పెరుగుతుంది. ఇలా స్ట్రాబెర్రీలతో ఎంతో రుచిగా చల్లగా ఉండే లస్సీని తయారు చేసుకుని రోజూ తాగవచ్చు. దీంతో మధ్యాహ్నం సమయంలో తాగితే ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది. వేడి నుంచి తప్పించుకోవచ్చు.