Left Over Idli Upma : మనం ఉదయం పూట అల్పాహారంలో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీలను మనం నూనె ఎక్కువగా ఉపయోగించకుండా ఆవిరి మీద తయారు చేస్తాం. కనుక ఇడ్లీలను తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అయితే ఒక్కోసారి మనం తయారు చేసే ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి. చల్లగా అయిన ఇడ్లీలను తినాలనిపించదు. ఇలా ఎక్కువగా మిగిలిన ఇడ్లీలను పడేయకుండా వాటితో ఎంతో రుచిగా ఉప్మాను తయారు చేసుకుని తినవచ్చు. ఇడ్లీలతో చేసే ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఉప్మాను తయారు చేయడం కూడా చాలా సులభమే. ఇడ్లీలతో ఉప్మాను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీలు – 8, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – 2 టీ స్పూన్స్, మినప పప్పు – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 2, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీ స్పూన్.

ఇడ్లీ ఉప్మా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీలను తీసుకుని పొడి పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు. జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత ఎండుమిర్చి, జీడిపప్పు పలుకులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి.
తరువాత పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీలను వేయాలి. దీనిని చిన్న మంటపై రెండు నుండి మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా ఉండే ఇడ్లీ ఉప్మా తయారవుతుంది. ఇడ్లీలు ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా ఉప్మా చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా చేసిన ఇడ్లీ ఉప్మాను ఒక స్పూన్ కూడా మిగల్చకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.