Gongura : గోంగూర.. ఇది తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో ఇది కూడా ఒకటి. చాలా మంది గోంగూరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. గోంగూరతో పప్పు, పచ్చడి వంటి వాటితో పాటు ఇతర వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. గోంగూరలో కొండ గోంగూర, మంచి గోంగూర అనే రెండు రకాలు ఉన్నాయి. కొండ గోంగూర కాడ కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది. ఆకు కూడా కొద్దిగా వగరు రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువగా నిల్వ పచ్చళ్లకు వాడరు. మంచి గోంగూర పుల్లగా రుచిగా ఉంటుంది. ఈ గోంగూరతోనే నిల్వ పచ్చడిని తయారు చేస్తారు.
రుచిగా ఉండడంతో పాటు గోంగూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గోంగూరను తరుచూ తీసుకోవడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయి. శరీరంలోని వాపులను, రేచీకటిని, బోదకాలు సమస్యను, శరీరంలో ఉన్న వ్రణాలను తగ్గించడంలో దివ్యౌషధంగా గోంగూర పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గడ్డలు, వ్రణాలు వంటి వాటితో బాధపడుతున్నప్పుడు గోంగూర ఆకులను దంచి ఆ మిశ్రమాన్ని ఆముదంతో కలిపి పట్టీలా వేయాలి. గడ్డలు, వ్రణాలు వంటి వాటిపై ఈ మిశ్రమాన్ని ఉంచి కట్టుకట్టడం వల్ల వ్రణాలు, గడ్డల వల్ల కలిగే బాధ తగ్గి అవి త్వరగా తగ్గుతాయి.
రేచీకటి వంటి దృష్టి లోపంతో బాధపడే వారు భోజనంలో తరచూ గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. రేచీకటి సమస్యతో బాధపడే వారు ఇలా గోంగూరను తీసుకుంటూనే గోంగూర పువ్వులను దంచి వాటి నుండి తీసిన అర కప్పు రసాన్ని అర కప్పు పాలతో కలిపి తీసుకోవడం వల్ల సమస్య త్వరగా నయం అవుతుంది. గోంగూరను, వేపాకును కలిపి దంచి ఆ మిశ్రమాన్ని బోదకాలుపై అలాగే శరీరంలో వాపులు ఉన్న చోట ఉన్న ఉంచి కట్టుకట్టడం వల్ల ఆయా సమస్యల నుండి పూర్తిగా బయటపడవచ్చు. విరేచనాలు భాధిస్తున్నప్పుడు కొండ గోంగూర నుండి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు వెంటనే తగ్గిపోతాయి.
మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరను అన్నంతో కలిపి తిన్నా కూడా విరేచనాలు తగ్గుతాయి. దగ్గు, ఆయాసం, తుమ్ముల వంటి శ్వాస కోస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి గోంగూర ఎంతగానో ఉపయోగపడుతుంది. గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల వెంటనే ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. గోంగూర పత్యం చేయడం వల్ల శరీరంలో చేరిన నీరు వెంటనే తొలగిపోయి వాపులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
గోంగూరలో విటమిన్ ఎ, బి1 బి2, బి9 లతోపాటు విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుంది. గోంగూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గోంగూరలో క్యాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. గోంగూరను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతోపాటు ఎముకలు కూడా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
గుండె, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో కూడా గోంగూర మనకు ఉపయోగపడుతుంది. గోంగూర మన ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పని చేస్తుందని దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.