Bendakaya Pulusu : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు ఒకటి. ఇవి మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాయి. వీటితో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. అయితే బెండకాయలతో ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించి సరిగ్గా చేయాలే కానీ.. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బెండకాయల పులుసును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయ ముక్కలు – పావు కేజీ, ఉల్లి తరుగు – ఒక కప్పు, టమాటా తరుగు – ఒక కప్పు, పచ్చి మిర్చి – మూడు, నూనె – మూడు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – రెండు రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా, పసుపు – చిటికెడు, మిరప కారం – రెండు టీస్పూన్లు, ఉప్పు – తగినంత, వేయించిన ధనియాల పొడి – ఒక టీస్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, చింత పండు రసం – అర కప్పు, ఆవాలు – ఒక టీస్పూన్, జీలకర్ర – ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీస్పూన్.
బెండకాయల పులుసు తయారీ విధానం..
స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పచ్చి మిర్చి ఉల్లి తరుగు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేయాలి. తరువాత పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అనంతరం ఒక గిన్నెలో టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యే వరకు చేత్తో కలపాలి. చింత పండు రసం కూడా జత చేసి మరోమారు కలపాలి. ఉల్లి తరుగు బంగారు రంగులోకి వచ్చాక కరివేపాకు జత చేయాలి. కలిపి ఉంచుకున్న టమాటా, చింత పండు రసం జత చేసి మూత పెట్టి సన్నని మంటపై నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.
బెండకాయ ముక్కలను వేసి కలపాలి. రెండు కప్పుల నీళ్లు పోసి మూత ఉంచి ఏడు నిమిషాలు ఉడకబెట్టాలి. తరువాత ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. కొత్తిమీరను కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. దీంతో ఎంతో రుచికరమైన బెండకాయల పులుసు తయారవుతుంది. దీన్ని అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.