Fish Fry : మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే వాటిల్లో చేపలు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. చేపలను తినడం వల్ల శరీరానికి ఎంతో అవసరమయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మనకు లభిస్తాయి. చేపలతో చేసే వంటకాలలో చేపల వేపుడు కూడా ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చేపల వేపుడును చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – 6 (మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా.
చేపల వేపుడు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వాటిలో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత ఆ చేప ముక్కలల్లో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీని వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఇలా కలిపిన తరువాత గిన్నెపై మూతను ఉంచి 20 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత లోతుగా, అడుగు భాగం మందంగా ఉండే కళాయిలో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. నూనె కాగిన తరువాత ఒకటి లేదా రెండు చేప ముక్కలను వేస్తూ మొదటి రెండు నిమిషాలు చిన్న మంటపై వేయించాలి.
తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేపల వేపుడు తయారవుతుంది. చేప ముక్కలను వేయించేటప్పుడు నూనె అయిపోయే కొద్దీ నూనెను పోస్తూ ఉండాలి. చేప ముక్కలను వేయించిన నూనెను మనం మరలా ఉపయోగించం. కనుక ఒకేసారి నూనె అంతా పోయకూడదు. ఈ విధంగా చేసిన చేపల వేపుడును అందరూ ఇష్టంగా తింటారు. చేపల పులుసును తినడానికి ఇష్టపడని వారు ఇలా వేపుడుగా చేసుకుని తినడం వల్ల ఎంతో రుచిని ఆస్వాదించవచ్చు.