Karam Podi : మనం వంటింట్లో ఎప్పుడూ ఏదో ఒక కారం పొడిని తయారు చేస్తూనే ఉంటాం. మనం కారం పొడులను అన్నంతో లేదా అల్పాహారాలతో తీసుకుంటూ ఉంటాం. వివిధ రకాల వేపుళ్లలో కూడా మనం కారం పొడులను వేస్తూ ఉంటాం. వంటరాని వారు కూడా చేసుకునే విధంగా చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో రుచిగా కారం పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు మిరపకాయలు – 200 గ్రాములు ( కారం తక్కువగా ఉండేవి), ధనియాలు – 25 గ్రాములు, జీలకర్ర – 25 గ్రాములు, కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లి గడ్డలు – 2, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
కారం పొడి తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఎండు మిరపకాయలను వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత ఇందులోనే ధనియాలను, జీలకర్రను కూడా వేసి మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మరలా ఉప్పును, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యిని వేసి నెయ్యిని వేడి చేయాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న కారం పొడిని వేసి చిన్న మంటపై అడుగు భాగం మాడిపోకుండా కలుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కారం పొడి చల్లగా అయిన తరువాత మూత ఉండే గాజు సీసాలో నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కారం పొడి తయారవుతుంది. వేపుడు కూరల తయారీలో కూడా ఈ కారం పొడిని వేసుకోవచ్చు. ఈ కారం పొడిలో నెయ్యిని వేసి అన్నంతో లేదా ఉదయం చేసే అల్పాహారాలతో కూడా తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.