Mirchi Bajji : వర్షం పడుతుంటే వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. అలాంటి సమయంలో వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపించడం సర్వసాధారణం. ఇలా వర్షం పడుతుంటే తినడానికి మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి బజ్జీలు. బజ్జీల రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతంది. వీటిని తినడానికి ఇష్టపడే వారు కూడా మనలో చాలా మందే ఉంటారు. ఇవి మనకు బయట కూడా దొరుకుతూ ఉంటాయి. బయట దొరికే బజ్జీలను తినడానికి చాలా సందేహిస్తూ ఉంటారు. కానీ బయట దొరికే బజ్జీలు ఎంతో రుచిగా ఉంటాయి. ఈ బజ్జీలను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా రుచిగా ఉండే బజ్జీలను ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బజ్జి మిర్చి – పావు కిలో, శనగ పిండి – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, వాము – రెండు టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, నీళ్లు – ముప్పావు కప్పు లేదా తగినన్ని, ధనియాలు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు- కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ రసం – కొద్దిగా.
స్ట్రీట్ స్టైల్ బజ్జీ మిర్చి తయారీ విధానం..
ముందుగా బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా చేసుకోవాలి. తరువాత ధనియాలను, ఒక టీ స్పూన్ ఉప్పును, ఒక టీస్పూన్ వామును రోట్లో కానీ జార్ లో కానీ వేసి పొడిలా చేసి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో జల్లెడను ఉంచి అందులో శనగ పిండిని, బియ్యం పిండిని, ఉప్పును, కారాన్ని, పసుపును, వంటసోడాను వేసి జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి ఉండలు లేకుండా ఉంటుంది.
తరువాత ఇందులో వామును వేసి కలుపుకోవాలి. తరువాత రెండు టీ స్పూన్ల వేడి నూనెను వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లను పోస్తూ దోశ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు మిర్చిని తీసుకుంటూ వాటికి నిలువుగా మధ్యలోకి కత్తితో గాటు పెట్టాలి. తరువాత ఈ మిర్చిలో ముందుగా మిక్సీ పట్టుకున్న వాము పొడిని అర టీ స్పూన్ మోతాదులో స్పూన్ సహాయంతో ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి నూనెను వేడి చేయాలి. ఈ నూనె మరీ వేడిగా కాకుండా ఉండాలి. నూనె వేడయ్యాక మిర్చిని పిండిలో పూర్తిగా ముంచి నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిర్చిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్ని మిర్చిలను తయారు చేసుకున్న తరువాత వాటిని మరలా మధ్యలోకి నిలువుగా కత్తితో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తరువాత బజ్జీలో ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను ఉంచి వాటిపై కొద్దిగా ఉప్పును, కారాన్ని, నిమ్మ రసాన్ని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా కరకరలాడుతూ ఉండే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జి తయారవుతుంది.
బయట అపరిశుభ్ర వాతావరణంలో చేసే బజ్జీలను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా బజ్జీలను తయారు చేసుకుని తింటూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది.