Moong Dal Pakoda : పెసలతో మనం ఎన్నో రకాల వంటలను తయారు చేస్తుంటాం. పెసరపప్పుతో అనేక రకాల కూరలను చేస్తుంటారు. అయితే పెసలతో పకోడీలను కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించాలే కానీ ఎంతో రుచికరమైన పెసర పకోడీలను చేసుకుని వేడి వేడిగా తినవచ్చు. ఇవి కరకరలాడుతాయి. పైగా పోషకాలను కూడా అందిస్తాయి. ఇక పెసర పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – ఒకటిన్నర కప్పు, ఎండు మిర్చి – ఐదు, అల్లం, పచ్చి మిర్చి పేస్ట్ – నాలుగు టీస్పూన్లు, కరివేపాకు రెబ్బలు – రెండు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా, చాట్ మసాలా – ఒక టీస్పూన్.
పెసర పకోడీలను తయారు చేసే విధానం..
పెసల్ని ఐదారు గంటల ముందు నానబెట్టుకుని మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా రుబ్బుకుని ఉప్పు కలిపి పెట్టుకోవాలి. కరివేపాకు, ఎండు మిర్చిని కూడా మెత్తగా చేసుకుని ఈ పిండిలో వేసుకోవాలి. అల్లం, పచ్చి మిర్చి మిశ్రమాన్ని కూడా పిండిలో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి వేడి అయ్యాక ఈ పిండిని పకోడీల్లా వేసుకుని ఎర్రగా వేగాక తీసేయాలి. వీటిపై చాట్ మసాలా చల్లి వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. పెసల్ని మొలకలు వచ్చాక పకోడీల్లా వేసుకుంటే మరీ మంచిది. ప్రోటీన్లు, ఇతర పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.