Mamidikaya Mukkala Pachadi : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. మనకు మామిడికాయలు ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ పండ్లను ఈ సీజన్‌లో చాలా మంది తింటుంటారు. ఇక పచ్చళ్లను కూడా పెడుతుంటారు. మామిడికాయల్లో అన్నింటితోనూ పచ్చడి పెట్టలేరు. కేవలం పులుపుగా ఉండే కాయలతోనే పచ్చడి పెడుతుంటారు. ఇక మామిడి కాయ పచ్చడిని కూడా చాలా మంది రకరకాలుగా పెడుతుంటారు. ఇందులో ముక్కల పచ్చడి ఒకటి. దీన్ని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడికాయ ముక్కల పచ్చడి పెట్టేందుకు కావల్సిన పదార్థాలు..
లేత మామిడికాయ ముక్కలు – 300 గ్రా. (టెంక ఉండకూడదు), ఉప్పు – 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరగాలి), మెంతులు – ఒక టీస్పూన్, రాళ్ల ఉప్పు – అర టీస్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు – ఒక టీస్పూన్, ఇంగువ – పావు టీస్పూన్, కారం – 3 టేబుల్ స్పూన్లు, మెత్తని ఉప్పు – అర టీస్పూన్, నిమ్మరసం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు.
మామిడికాయ ముక్కల పచ్చడి తయారీ విధానం..
ఒక పాత్రలో మామిడికాయ ముక్కలు, అల్లం ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల మెత్తని ఉప్పు వేసి కలిపి పక్కన ఉంచి ఊరనివ్వాలి. స్టవ్ మీద పాన్‌లో ఒక టీస్పూన్ మెంతులు వేసి సన్నటి మంటపై సువాసన వచ్చే వరకు వేయించి దింపేయాలి. ఈ మెంతులకు అర టీస్పూన్ ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. స్టవ్ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కాగిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడగానే దింపేయాలి. నూనె గోరు వెచ్చగా అయ్యాక పావు టీస్పూన్ ఇంగువ, మూడు టేబుల్ స్పూన్ల కారం, ఒక టీస్పూన్ మెత్తని ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు, మెత్తగా చేసిన మెంతి పిండి జత చేసి బాగా కలపాలి. ఆరేడు గంటల తరువాత అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. త్వరగా అయిపోతుంది కూడా.