Masala Bath : మనం రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన రైస్ వెరైటీలో మసాలా బాత్ కూడా ఒకటి. మహారాష్ట్ర స్పెషల్ వంటకమైన ఈ మసాలా బాత్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ మసాలా బాత్ ను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కమ్మగా ఉండే ఈ మసాలా బాత్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా బాత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఇంగువ – రెండు చిటికెలు, పసుపు – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ముప్పావు టీ స్పూన్, క్యారెట్ ముక్కలు – పావు కప్పు, తరిగిన బీన్స్ – 3, దొండకాయ చీలికలు – 3, తరిగిన చిన్న బంగాళాదుంప – 1, తరిగిన వంకాయ – 1, అర గంట పాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు , వేడి నీళ్లు – రెండు కప్పులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క -ఒక ఇంచు ముక్క, వాము – ఒక టీ స్పూన్, లవంగాలు – 8, తోక మిరియాలు – అర టీ స్పూన్, పత్తర్ ఫూల్ – అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 4, యాలకులు – 6, మిరియాలు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, నలక్కాయలు -2, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, , ఎండు కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా బాత్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. వీటిని చిన్న మంటపై దోరగా వేయించి జార్ లోకి తీసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కుక్కర్ లో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఇంగువ, పసుపు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి నుండి ఒక టీ స్పూన్ మసాలా పొడి వేసి కలపాలి. తరువాత కూరగాయ ముక్కలు వేసి కలపాలి.
వీటిని మూత పెట్టి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని రెండు నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ పెద్ద మంటపై ఒక విజిల్ చిన్న మంటపై వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా బాత్ తయారవుతుంది. లంచ్ బాక్స్ లోకి అలాగే నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా మసాలా బాత్ ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.