Masala Mirchi : మనం వంటల్లో మిర్చిని విరివిగా వాడుతూ ఉంటాము. పచ్చిమిర్చి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండడంతో పాటు వంటలకు కూడా చక్కటి రుచిని తీసుకువస్తుంది. ఇలా వంటల్లో వాడడంతో పాటు పచ్చిమిర్చితో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా మిర్చిని కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా మిర్చి చాలా రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి, అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ మసాలా మిర్చిని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చితో రుచిగా మసాలా మిర్చిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా మిర్చి తయారీకి కావల్సిన పదార్థాలు..
బజ్జీ మిరపకాయలు – పావుకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, చాట్ మసాలా – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్.
మసాలా పొడికి కావల్సిన పదార్థాలు..
మెంతులు – పావు టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ధనియాలు – 3 టేబుల్ స్పూన్స్, సోంపు గింజలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, నువ్వులు – పావు కప్పు.
మసాలా మిర్చి తయారీ విధానం..
ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తొడిమలను తీసేసి నిలువుగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాలపాటు వేయించిన తరువాత చాట్ మసాలా, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా మిర్చి తయారవుతుంది. వీటిపై నిమ్మరసం పిండుకుని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ ఒకేరకం వంటలు కాకుండా ఇలా పచ్చిమిర్చితో వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.