Meal Maker Palak Curry : మనం పాలకూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూరతో చేసే కూరలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా సొంతం చేసుకోవచ్చు. మనం పాలకూరతో ఎక్కువగా పాలక్ రైస్, పప్పు, కూర వంటి వాటినే మాత్రమే తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా మనం మీల్ మేకర్ మరియు పాలకూర కూడా కలిపి చక్కటి కూరను తయారు చేసుకోవచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ పాలక్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీల్ మేకర్ పాలక్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పాలకూర – 2 పెద్ద కట్టలు, మీల్ మేకర్ – ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన టమాటాలు -3, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్.
మీల్ మేకర్ పాలక్ కర్రీ తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లలో వేడి నీటిని పోసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తరువాత నీటిని పిండేసి మీల్ మేకర్ లను పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి.
టమాట ముక్కలు మగ్గిన తరువాత పాలకూర వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి పాలకూర మెత్తబడే వరకు ఉడికించాలి. తరువాత మీల్ మేకర్, గరం మసాలా వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ పాలక్ కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పాలకూరతో తరచూ ఒకేరకం కూరలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు.