Methi Paratha : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మెంతి కూర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా మనకు మెంతికూర ఉపయోగపడుతుంది. మెంతికూరను వంటల్లో వాడడంతో పాటు దీనితో ఎంతో రుచిగా ఉండే మెంతి పరాటాను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పరాటా చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. మెంతికూరతో పరోటాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతి పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన మెంతికూర – 4 కట్టలు ( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, అల్లం – అర ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 3, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గోధుమపిండి – రెండు కప్పులు, శనగపిండి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీస్పూన్.
మెంతి పరోటా తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతికూరను వేసి దగ్గర పడే వరకు వేయించాలి. తరువాత ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో వేయించిన మెంతికూర మిక్సీ పట్టుకున్న పేస్ట్ తో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పిండిని 15 నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత పిండిని మరోసారి బాగా కలుపుకుని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పొడి పిండి చల్లుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న తరువాత స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం పరోటాను వేసి కాల్చుకోవాలి. ముందుగా దీనిని రెండు వైపులా కాల్చుకున్న తరువాత నూనె వేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ పరోటాను చపాతీలా రుద్దుకున్న తరువాత దానిపై నూనె, పొడి పిండి చల్లుకుని రెండు మడతలుగా చేసుకోవాలి. మరలా దీనిని చపాతీలా రుద్దుకుని కాల్చుకోవాలి. ఇలా మెంతి పరోటాను రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసిన కూడా ఎంతో రుచిగా ఉండే మెంతి పరోటా తయారవుతుంది. దీనిని టమాట పచ్చడి, టమాట కూర వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మెంతికూరను తినడానికి ఇష్టపడని వారికి ఇలా పరోటాను చేసి ఇవ్వడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించవచ్చు.