Tomato Kothimeera Pappu : కొత్తిమీరను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనిని ఎక్కువగా వంటలను గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. గార్నిష్ కోసమే కాకుండా కొత్తిమీరతో మనం ఎంతో రుచిగా ఉండే పప్పు కూడా చేసుకోవచ్చు. కొత్తిమీరకు టమాటాలను కలిపి చేసే ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎంతో రుచిగా ఉండే టమాట కొత్తిమీర కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కొత్తిమీర పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన కొత్తిమీర – రెండు కట్టలు, కందిపప్పు – 100 గ్రా., నీళ్లు – ఒక గ్లాస్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన టమాటాలు – 4 ( మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, కరివేపాకు – ఒక రెమ్మ.
టమాట కొత్తిమీర పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పును వేసి శుభ్రంగా కడగాలి. తరువాత అందులో నీళ్లు, టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, అర టీ స్పూన్ పసుపు వేయాలి. తరువాత దీనిపై మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, చింతపండు రసం, మరో అర గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత ముందుగా సిద్దం చేసుకున్న పప్పును వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కొత్తిమీర పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు రోటీ, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా కొత్తిమీరతో పప్పును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.