Chintakaya Pachadi : మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది పచ్చడితో తిన్న తరువాతే కూరతో భోజనం చేస్తూ ఉంటారు. పచ్చళ్ల తయారీలో మనం ఎక్కువగా చింతపండును వాడుతూ ఉంటాం. కొంతమంది చింతపండుకు బదులుగా పచ్చి చింతకాయలను తీసుకుని వాటికి ఉప్పు, పసుపును కలిపి దంచి నిల్వ చేసుకుని దానిని పచ్చళ్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా నిల్వ చేసుకున్న పచ్చి చింతకాయ పచ్చడిని నేరుగా తినలేరు. కనుక దీనికి పల్లీలను కలిపి మరింత రుచిగా పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు. నిల్వ చేసుకున్న ఈ పచ్చి చింతకాయ పచ్చడితో పల్లీలను కలిపి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు- ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 5, ఉప్పు – తగినంత, పచ్చి చింతకాయ నిల్వ పచ్చడి – ఒక టేబుల్ స్పూన్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – అర టీ స్పూన్, మినప ప్పు – అర టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండు మిర్చి – 2.
చింతకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత శనగ పప్పు, మినప పప్పు వేసి వేయించి వీటన్నింటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇందులో కారం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి చింతకాయ నిల్వ పచ్చడి, కొద్దిగా ఉప్పును వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలిపి నూనె పైకి తేతే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పచ్చి చింతకాయ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.