Mokkajonna Bellam Garelu : మొక్కజొన్నలు అంటే సహజంగానే చాలా మందికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. వీటితో చాలా మంది వివిధ రకాల వంటకాలను చేస్తుంటారు. మొక్కజొన్న గారెలు, రొట్టెలు చేస్తుంటారు. కొందరు మొక్కజొన్నలను ఉడకబెట్టి తింటుంటారు. కొందరు వేయించుకుని తింటారు. మొక్కజొన్నను ఎలా చేసినా సరే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మొక్కజొన్నలతో రెగ్యులర్‌గా చేసుకునే గారెలకు బదులుగా బెల్లం వేసి కూడా గారెలను చేసుకోవచ్చు. ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. తీపి అంటే ఇష్టపడే వారు ఈ గారెలను ఎక్కువగానే తింటారు. వీటిని తయారు చేయడం కూడా సులభమే. మొక్కజొన్న బెల్లం గారెలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొక్కజొన్న బెల్లం గారెల తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్కజొన్న గింజలు – రెండు కప్పులు, బియ్యం పిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, బెల్లం తరుగు – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీస్పూన్, వంటసోడా – చిటికెడు, నూనె – వేయించేందుకు సరిపడా.
మొక్కజొన్న బెల్లం గారెలను తయారు చేసే విధానం..
మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, వంటసోడా వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో బెల్లం తరుగు, పావు కప్పు నీళ్లు, యాలకుల పొడి వేసుకుని స్టవ్ మీద పెట్టాలి. బెల్లం కరిగి తీగపాకంలా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడెక్కాక మొక్కజొన్న పిండిని గారెల్లా చేసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి. తరువాత వాటన్నింటినీ బెల్లం పాకంలో వేసి తీసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన మొక్కజొన్న బెల్లం గారెలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.